
వేలేరు మండలంలోని తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల మరియు కస్తూరిభా గాంధీ పాఠశాలలను మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పాఠశాలలోని తరగతి గదులను, వంట గదులను, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పాఠశాలలోని వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంట గదిలోని బియ్యం, ఇతర సరుకులను పరిశీలించిన ఎమ్మెల్యే గారు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సంబంధిత వర్కర్లకు, ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన కనీస వసతులను వెంటనే ఏర్పాటు చేయాలనీ అధికారులను ఆదేశించారు. పాఠశాల గ్రౌండ్ అంతా చిత్తడిగా పిచ్చిమొక్కలతో నిండి ఉందని వెంటనే విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు వీలుగా గ్రౌండ్ ను చదును చెయాలనీ సూచించారు. కస్తూరిభా గాంధీ పాఠశాలలో సరిపడా గ్రౌండ్ లేనందున సరిపడా భూమిని సేకరించి కొనుగోలు చేయాలనీ అలాగే గ్రౌండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులకు తెలిపారు. వీటితో పాటు మిషన్ భగీరథ పథకం ద్వారా పాఠశాలలకు త్రాగు నీరు అందించడంతో పాటు ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలనీ అన్నారు. విద్యార్థులకు సరిపడా నీరు అందుబాటులో ఉండే విధంగా అదనపు బోర్ వెల్ ఏర్పాటు చేయాలనీ అన్నారు. ఎమ్మార్వో, ఎంపీడివో, సీఐ లు ప్రతీ వారం పాఠశాలలను తనిఖీ చేయాలనీ, అలాగే పాఠశాల పరిసరాలలో ఆడపిల్లలకు ఇబ్బంది కలిగే విధంగా పోకిరిలు, ఆకతాయిలు అల్లర్లు చేయకుండా, అనైతిక చర్యలకు పాలకుండా గట్టి బందోబస్త్ ఏర్పాటు చేయడంతో పాటు నిరంతరం గస్తీ కాయలని ఆదేశించారు. పాఠశాలాల పరిసరాల్లో అల్లరిమూకలు తిరిగినట్లు తెలిస్తే ముందుగా పోలీస్ అధికారులపై, పాఠశాల సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఉపాధ్యాయులకు, అధికారులకు చెప్పారు.